మంగళవారం

think

ఒక్కోసారి మనకు మనమే అట్టే ఎదురుచెప్పకుండా ,మనస్తాపం చెందకుండానే మన అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటాం.కానీ అదే ఇంకెవరైనా మన అభిప్రాయాలు తప్పని చెపితే ,ఆ ఆరోపణ మనకి కోపం తెప్పించి ,మన మనసును కఠినంగా మారుస్తుంది. నమ్మకాలని ఏర్పరచుకోవటంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. కానీ ఎవరైనా ఆ నమ్మకాలని మనకి దూరం చెయ్యాలని ప్రయత్నించినప్పుడు మాత్రం వాటి మీద ఎక్కడలేని ఆపేక్షా పొంగి పొర్లుకొస్తుంది. ఆ అభిప్రాయాల మీద మనకి అట్టే మమకారం లేదని ,మన స్వాభిమానం దెబ్బతినటం వల్లే మనం అలా ప్రవర్తిస్తామని స్పష్టంగా అర్థమైపోతుంది.మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన పదం "నా"అనేది.కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అంచనా కట్టడంలోనే ,మనం తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది.మన అభిప్రాయాల్ని సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని ఎవరైనా అంటే మనం మొహం మాడ్చుకుంటాం.మనం దేన్నయితే ఇన్నాళ్లూ నిజమని నమ్ముతూ వచ్చామో,దాన్నే ఇకమీదట కూడా కొనసాగించాలని అనుకుంటాం.మన నమ్మకాల గురించి ఎవరైనా సందేహం వెలిబుచ్చినప్పుడు కలిగే కోపం వల్ల ,మనం ఆ నమ్మకాలనే పట్టుకు వేలాడటానికి అన్నిరకాల కుంటిసాకులు వెతుకుతాం. దీనివల్ల జరిగేదేమిటంటే ,మనం ఇంతకుముందునుంచి వేటినైతే నమ్ముతున్నామో వాటినే సమర్థించుకోవటానికి అవివేకంగా ఎన్నోరకాలుగా వాదిస్తూ ఉంటాం.ఇదే మనం ఆనందం కోల్పోవడానికి చాలా సార్లు కారణమౌతుంది.