గురువారం

అదృష్టం!!.

"అతను పగలల్లా పని చేశాడు,
రాత్రిళ్లూ కష్టపడ్డాడు,
ఆట పాటలు మానేశాడు,
ఆనందం వదులుకున్నాడు,
పుస్తకాలెన్నో చదివాడు,
కొత్త విషయాలు తెలుసుకున్నాడు,
ముందుకి దూసుకుపోయి
విజయాన్ని పొందాలనుకున్నాడు,
ఒక్కొక్క అడుగూ
నమ్మకంతోనూ,ధైర్యంతోనూ వేశాడు,
చివరికి అతను విజయాన్ని సాధిస్తే
అది అదృష్టమని అందరూ అన్నారు"

అభ్యాసం,అవకాశం కలిసినప్పుడే అదృష్టం పండుతుంది.ప్రయాస,అభ్యాసమూ,ప్రయత్నమూ లేనిదే అనుకోని అదృష్టం కలగదు.
గొప్ప పనులు చెయ్యాలనుకునే వారికి ఒక లక్ష్యం ఉంటుంది.మిగతా వారికి కోరికలు మాత్రమే ఉంటాయి.

శనివారం

బాధ పడకండి!.భయపడకండి!!.వదిలి పెట్టకండి!!!.

“ జీవితంలో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది .
అనుకోని పనులు నెరవేరనప్పుడు
మీరు నడిచే దారి సాఫీగా లేనప్పుడు
మీ రాబడి కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నప్పుడు
మీరు నవ్వాలని ప్రయత్నిస్తే నిట్టూర్పులే వచ్చినప్పుడు
విచారం మిమ్మల్ని కొద్దిగా నొక్కి పెడుతూంటే-
కావాలంటే విశ్రాంతి తీసుకోండి,
కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం వదలకండి.

చిత్రమైన ఈ జీవితంలో చిక్కులూ,సమస్యలూ నిండి ఉంటాయి .
ఈ సత్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు మనందరం గ్రహిస్తాం.
కాస్త ఓర్మి వహిస్తే గెలుపు సాధ్యమయే తరుణంలో
మనిషి వెనుకంజ వేసి విఫలుడౌతూ ఉంటాడు.
మీ గమనం మందకోడిగా సాగినా ఆగకండి-
ఇంకాస్త ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది.

విజయం అనేది ఓటమి యొక్క మరో ముఖం-
సందేహం అనే మబ్బుల కుండే వెండి వెలుగుల అంచు అది.
విజయం ఎంత దూరంలో ఉందో చెప్పటం అసాధ్యం.
మీరు ఎంతో దూరంలో ఉందనుకున్నది చేతికందే దూరంలోనే ఉండవచ్చు.
కష్టాల్లో చిక్కుకున్నప్పుడే మీరు ధైర్యంగా నిలబడాలి.
పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నప్పుడే పట్టుదలతో ప్రయత్నించాలి.

మీరు అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి చేసే ప్రయాణం సుగమం కాదు.
అడుగడుక్కీ విఘాతాలు ఎదురౌతాయి.విజయాన్ని సాధించే వారికి , వీటిని అధిగమించి , నేలకి కొట్టిన బంతిలా పైకి లేచి , ఇంకా దృఢమైన నిశ్చయంతో , ముందుకి పోయే సామర్థ్యం ఉంటుంది.
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని , జీవితాన్ని సార్థకం చేసుకోవాలని తహతహలాడు తుంటారు .కాని అందుకు తగిన ప్రయత్నాలు చేయకుండా తమ కష్టాలు తొలగిపోవాలని , అదృష్టం కలిసి రావాలని ,పరిస్థితులు అనుకూలంగా మారాలని ఎదురుచూస్తుంటారు .అతి కొద్ది మంది మాత్రమే తమ జీవితంలో గణనీయమైన మార్పును కొనిరావడానికి ప్రయత్నిస్తారు .
ఆ ప్రయత్నమే వారిని విజయపథం వేపు మరలిస్తుంది .”

గురువారం

తస్మాత్ జాగ్రత్త!!.

చిన్న చిన్న కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి,
అవి పగలూ రాత్రీ మిమ్మల్నే గమనిస్తున్నాయి.
చిన్న చెవులు కూడా ఉన్నాయి,
అవి మీరనే మాటల్ని ఎప్పటికప్పుడు వింటునే ఉన్నాయి.
చిన్న చిన్న చేతులూ ఉన్నాయి,
మీరు చేసే ప్రతి పనిని చెయ్యటానికి అతురత చూపుతున్నాయి.
ఒక చిన్న పిల్లవాడు కలలు కంటున్నాడు,
ఏదో ఒకనాడు మీలాగే తయారు కావాలని.
మీరే ఆ చిన్నారి బాబుకు ఆదర్శం,
అందరిలోకీ తెలివైన వారు మీరేనట.
ఆ చిన్నారి మనసులో ,
మీమీద ఎన్నడూ సందేహమనేది కలుగదు.
మీరంటే వాడికి ప్రగాఢమైన విశ్వాసం.
మీరు అనే మాటా, చేసే పనీ, అతని మనసుకి హత్తుకుంటుంది.
అతను మీలాగే మాట్లాడతాడు,ప్రవర్తిస్తాడు.
పెరిగి పెద్ద వాడయాక, మీలాగే తయారవుతాడు.
మీరు ఎప్పుడూ తప్పుచెయ్యరన్న ధీమా.
అతని కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి.
పగలూ రాత్రీ మిమ్మల్నే గమనిస్తూ ఉంటాయి.
మీరు అతని ముందు ఒక ఆదర్శాన్ని ఉంచుతున్నారు.
రోజూ మీరు చేసే ప్రతి పనిలోనూ
అతను నేర్చుకునే విషయాలెన్నో!.
వేచి ఉన్నాడు.................
పెద్దయాక మీలాగే తయారవటానికి.

అందుకే తస్మాత్ జాగ్రత్త!!(మీ ప్రవర్తనను పునఃసమీక్షించుకోండి).

“ మంచితనం-సేవాభావం-ఆత్మగౌరవం ఉన్న తల్లి దండ్రులు పిల్లల్లో కూడా వాటిని పెంపొందించగలుగుతారు. వారికి సానుకూలమైన ఆలోచనలనీ, నమ్మకాలనీ, విలువలనూ నేర్పిస్తారు. దీనికి విరుద్ధంగా జరిగే అవకాశం కూడా ఉంది.
నిజాయితీ గల తల్లిదండ్రులకి పుట్టడం , వారసులవటం ,నిజంగా ఎంతో గోప్ప విషయం .”

ఆదివారం

జీవితం!.విజయం!!.సంతృప్తి!!!.

జీవితంలో సఫలంగా ,సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి . విజయం అంటే మీకిష్టమైన దాన్ని పొందడం, సంతృప్తి అంటే పొందిన దాన్ని ఇష్టపడడం . జీవితంలో విజయం ,సంతృప్తుల మధ్య సమతౌల్యం ఉండాలి .
విజయం కోసం పని చేయండి .పనిని ఆటగా భావించండి .ఆట కోసం పని చేయకండి .విజయాన్ని ఎంతగా సాధించినా ,కృతజ్ఞతతో ఉండండి .తద్వారా మీ సఫలత అహంకారానికి దారితీయదు .అహం అంటే భగవంతుని తోసివేయడమే అని గుర్తుంచుకోండి .
సంతృప్తితో ఉండాలంటే “ ఉన్నదాని “ తో ప్రశాంతంగా ఉండాలి .”ఉన్నదాని”తో వివాదం పెట్టుకోకండి .సామరస్యంతో ఉండండి .అపరిపూర్ణతలోని సొగసును చూడడం నేర్చుకోండి .ఉన్నదానిలో సౌందర్యాన్ని చూడండి .అప్పుడే మీకు సంతృప్తి లభిస్తుంది .
సీతాకోక చిలుకలా జీవించండి .అది ఇతరులను గందరగోళపరచదు .భారం కలిగించదు .అందంగా ,హాయిగా ఉంటుంది .పుష్పాలనుంచి తేనెను ఇది సేకరించగలదు . వేరెవ్వరూ ఈ పని చేయలేరు .ఇతరుల నుంచి నేర్చుకోండి .ఇతరులను విసిగించకండి .జీవం తొణికిసలాడేలా ఉండండి .రంగురంగుల జీవితం మిమ్మల్ని నూతన జీవన మార్గంలోకి నడిపిస్తుంది .