శనివారం

విజేతలు మీరే !!.

ఓటమి చెందడం అనేది ,మన మనసులోని ఆలోచన మాత్రమే .అది ఒక మానసిక స్థితి మాత్రమే.అంతకు మించి ఏమీకాదు.మనం జీవితంలో సాధించిన విజయాలను చూసి,ఎంతగానో పొంగిపోతుంటాము.పదిమందికి మన గొప్పతనాన్ని ప్రదర్శించి ,వారి అభినందనలను పొందాలని తాపత్రయపడతాము.కానీ మనకేదయినా ఓటమి ఎదురైనపుడు మాత్రం,ఎవరో ఒకరిపైకి,నెపంనెట్టివేయాలని చూస్తాం.ఏదోఒక వంక చూపిస్తాము.
మీ జీవితాన్ని నిరంతరం నిర్దేశించేది,నడిపించేది మీరు అలవరచుకునే ధృక్పధమే!.మిమ్మల్ని మీరు విజేతలుగా ఊహించుకోవడమంటే ,ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం,మున్ముందుకు ఎదగడమే తప్ప ,ఎదుటివారిని ఓడించడము కాదు .ఎదుటివారి చేతిలో ఓటమి పొందడమూ కాదు.ఓటమి సంభవించిందని, ఫలితంగా తీరని అవమానం ఎదురైందని భావించి కృంగిపోయేవారు,నిజంగానే ఓటమి పాలవుతారు.అలాకాకుండా ఓటమికి కారణమైన సంఘటనలను నిశితంగా పరిశీలిస్తూ,దానినుండి కొత్త విషయాలు,మెళకువలు నేర్చుకోవచ్చు.నూతన నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు.ఇలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం నుండి చాలా నేర్చుకోవచ్చు.మీ జీవితంలో ఎదురయ్యే విభిన్న అనుభవాలను ,మీరు అభివృద్ధి చెందడానికి వచ్చిన అవకాశాలుగా పరిగణించాలి.
మీ ప్రవర్తనను నడిపించేది ,మీ మనస్సులో కలిగే భావనలేనని,ఆ భావనలను నిర్దేశించేది మీ ఆలోచనా ధోరణేనని,మీ ఆలోచనా ధోరణి ఏలా ఉండాలో నిర్ణయించేది మీరేనని ,మీరు గుర్తించగలిగితే చాలు. విపత్కర పరిస్థితులు మిమ్మల్ని అచేతనుల్ని,నిస్సహాయుల్ని చేయడానికి ప్రయత్నిస్తాయి. మీరు సరైన ఆలోచనా ధోరణిని అలవరచుకుంటే, ఆ పరిస్థితులను సులభంగా అధిగమించగలరు.
మీకు సాధ్యం కానిది లేదు!!.

మంగళవారం

జీవితం!!.

మీ బాధలకు ,దుఃఖాలకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకుంటే, బాధలన్నింటినీ తొలగించుకునేందుకు అది సహాయపడుతుంది.మనకు జీవితం ఎంత విశాలమైనదో తెలియదు-కాబట్టే మనం తరచుగా బాధలను అనుభవిస్తున్నాము.మంచి-చెడు,తప్పు-ఒప్పు,సుఖం-దుఃఖం,లాభం-నష్టం,అందమైనది-అందవిహీనమైనది అంటూ విడివిడిగా విభజించేందుకు ,జీవితం చిన్నది కాదు.ద్వంద్వాలను అన్నింటినీ తనలో ఇముడ్చుకునేంత విశాలమైనది జీవితం.
జీవితం ఒక అవకాశం-దానిని సద్వినియోగం చేసుకో
జీవితం ఒక సాహస కృత్యం-దానికి పూనుకో
జీవితం దుఃఖమయం-దానికి అతీతంగా ఎదుగు
జీవితం ఒక పోరాటం-దానిని పవిత్రంగా మార్చు
జీవితం ఒక ఆట-ఆడుకో
జీవితం ఒక పాట-పాడుకో
జీవితం ఒక వాగ్దానం-నెరవేర్చు
జీవితం ఒక కల-వాస్తవం చేసుకో
జీవితం ఒక అందం-ఆస్వాదించు
జీవితం పరమానందం-అనుభూతి చెందు...

సోమవారం

బ్రతక్కండి!!.....జీవించండి!!!.

ఈ వాస్తవ ప్రపంచంలోని మనకు జీవించడానికి రెండో అవకాశం రాదు. అందుకే మరీ అలస్యమయ్యే లోపల ,జీవితమనే కానుకని అనుభవించడానికి మేలుకోవాలి. కాలం నిజంగానే వేళ్లనుంచి ఇసుక జారి పోయినట్లు జారి పోతుంది. ఈ క్షణం నుంచే మీ జీవితంలో ఏది ముఖ్యమో మీరు తెలుసుకొండి- తేల్చుకోండి. మీ జీవితాన్ని మరింత అర్థవంతం చేసే వ్యక్తులతో జీవితాన్ని పంచుకోండి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకున్నవన్నీ చెయ్యండి. వర్షంలో నాట్యం చెయ్యాలనుకుంటే చెయ్యండి. కొత్త భాష నేర్చుకోవాలని అనుకుంటే నేర్చుకోండి.సంగీతాన్ని ప్రేమించడం నేర్చుకోండి. మీ బాల్యంలోని ఆనందాలను ,మీ జీవితంలోని మధురక్షణాలను మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోండి. జీవితంలోని ప్రత్యేక క్షణాలను, వాటి శక్తినీ అనుభవించండి.
విజయం లేదా సంపాదన కోసం మీ ఆనందాన్ని త్యాగం చెయ్యకండి. ఫలితాన్ని ఎంజాయ్ చెయ్యడం కంటే మీరు చేసే పనిని ఎంజాయ్ చెయ్యండి. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక అధ్భుతమే .ఏదో ఒక రకంగా మనందరం విజేతలమే. అందరిలోనూ అసాధారణాన్ని సాధించడానికి ,సంపూర్ణసంతృప్తి పొందడానికి కావలసిన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. కావలసిందల్లా ఆ కలల సాఫల్యం వైపుగా అడుగులు వేయడమే. ఈ చిన్నచిన్న మార్పులు క్రమంగా మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. వాటి నుంచి సానుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈ ఫలితాలవల్ల మీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు చోటుచేసుకుంటుంది. ప్రతి దినం ,ప్రతి క్షణం మీ జీవితంలో ఆఖరిదైనట్టుగా జీవించండి. ఈ రోజు నుంచి ఎక్కువగా నేర్చుకోండి. ఎప్పుడూ చిరునవ్వులు చిందించండి. మీకు నిజంగా ఇష్టమైన పనులు చేయండి లేదా చేసే పనులను ఇష్ట పడండి. మీ భవిష్యత్తును మీరే నిరాకరించుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోట్ల మంది బ్రతుకుతారు, కానీ కొద్ది మందే జీవిస్తారు.

ఆదివారం

పొరపాటు!!.

రేపు మీరు బాగుపడాలంటే ,ఈ రోజు మీరేం తప్పులు చేశారో మీకు తెలియాలి.అలా తెలుసుకొని ,మళ్ళీ అవి జరగకుండా ఒక ప్రణాళిక వేసుకోవాలి.పొరపాట్లు చేయడం తప్పేమి కాదు.మన జీవితంలో ,మన అభివృద్ధిలో అవి భాగాలు ."ఆనందం మంచి విచక్షణ వల్ల వస్తుంది.విచక్షణ అనుభవం వల్ల వస్తుంది.అనుభవం విచక్షణ లేకపోవడం నుంచి వస్తుంది."కానీ ఒకే తప్పును పదేపదే చేయడంలో మాత్రం ఏదో దోషం ఉంది. ఇది ఆ మనిషికి వివేకం అసలే లేదని నిరూపిస్తుంది.మనుషుల్ని ,జంతువుల నుంచి విడదీసే మౌళిక లక్షణం ఇదే.ఒక్క మనిషి మాత్రమే తన నుంచి తాను విడిపోయి ,తను చేసిన పని తప్పా,ఒప్పా అని వివేచించగలడు.జంతువులు ఆ పని చేయలేవు. మీరు చేయగలరు.ఆత్మావలోకన విధి చెప్పేది దీన్ని గురించే .మీ దినచర్యలో ఏది సరిగ్గా ఉందో,ఏది లేదో మీరే నిర్ణయించుకోండి.ఆ తర్వాత దానికి అవసరమైన మెరుగులు దిద్దుకోండి .

శుక్రవారం

జీవితాశయం!!.

ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి ,ఆ ఆదర్శం ఏదోఒకరకంగా ఇతరుల జీవితాన్ని మెరుగుపరచేలా ఉండి,దానికి అంకితభావంతోకృషి చేసినపుడు,ఆయాచితంగానే ఆనందం లభిస్తుంది.మీ జీవితలక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ఆ ఖచ్చితమైన లక్ష్యం పైనే మీ శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది.మీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు.కనక,ఎంతో విలువైన మీ మనశ్శక్తి ,అనవసరమైన ఆలోచనలపై వ్యర్థమవదు.మీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి,మరింత ఉత్పాదక స్వభావంతో పని చేస్తారు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ,మీ లక్ష్యసాధనకు మీ అంతరాంతరాల్లోంచి ఎవరో మార్గం చూపుతున్నట్లు మీలో ఒక విధమైన ప్రశాంతత,సంయమనం చోటుచేసుకుంటాయి.మీకు అలవాటైన పరిధి నుంచి బయట పడమనే దాన్ని అధిగమించినప్పుడే మనిషిగా మీలో ఉండే శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోగల్గుతారు.నెమ్మదిగా ఆలోచించండి, మన జన్మకు సార్థకత ఏమిటో దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి.అదో అద్భుతమైన అనుభూతి.

గురువారం

ఆనందం!!.

ఆనంద రహస్యం చాలా చిన్నది .మీకేం చేయడం అత్యంత ప్రీతికరమో తెలుసుకుని,మీ యావత్ శక్తిని దాని వైపు మళ్ళించండి.ప్రపంచంలో అత్యంత ఆనందంగానూ,ఆరోగ్యంగానూ,తృప్తిగానూ జీవించే వారిని చూసారంటే మీకే ఆర్థమవుతుంది.వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి,దాని అన్వేషణకు,సాధనకు,జీవితాన్ని వెచ్చించారని .సాధారణంగా ఆ వ్యక్తులకు ఒకే ఆశయం ఉంటుంది.అందులో సేవా దృక్పథమూ ఉంటుంది.ఒక్కసారి మీ మనశ్శక్తిని మీరు ప్రేమించే విషయం వైపుకు మళ్ళించారంటే ,మీకు అన్నీ సమృధ్దిగా లభిస్తాయి.మీ ఆకాంక్షలన్నీ సుళువుగా,హుందాగా తీరుతాయి.

మంగళవారం

థింక్ బిగ్!!

మీకు ఉన్న సామర్థ్యాన్ని విడుదల చేయాలంటే ,ముందు మీ కల్పనను విస్తృతం చేయాలి. ప్రతి వస్తువు ,రెండు సార్లు సృష్టింపబడుతుంది. మొదటిసారి మన మనసనే వర్కుషాపులో ,తర్వాత వాస్తవంలో .ఎందుకంటే మీరు బాహ్య ప్రపంచంలో సృష్టించింది ఏదైనా మొదట మీ మనసనే తెరపై మీ అంతర ప్రపంచంలో మాములు బ్లూప్రింట్ లా కల్పించబడుతుంది. మీ ఆలోచనలను నియంత్రించుకొని ,ఈ బాహ్య ప్రపంచం నుంచి మీరు ఏం ఆశిస్తారో స్పష్టంగా ఆకృతి ఏర్పడిన తర్వాత ,మీలో నిద్రాణమైయున్న శక్తులు జాగృతమవుతాయి. మీ నిజమైన సామర్థ్యాన్ని మేల్కొలిపి ,మీకు యోగ్యమైన అద్భుత జీవితాన్ని మీరు గడపగలుగుతారు. ఈ రాత్రి నుంచి గతాన్ని మరచిపోండి. మీ ప్రస్తుత పరిస్థితుల సమాహారం కంటే మీకు ఉన్నతమైన అర్హతలున్నాయని కలలుకనే ధైర్యం చెయ్యండి. మీకు అత్యధిక ఫలితాలే వస్తాయని ఆశించండి.వస్తాయి కూడా………..
యత్ భావం -- తత్ భవతి.(మీరు కోరుకున్నదే జరుగుతుంది.)

సోమవారం

అవకాశాలు!!

మీరు సంఘటనలను మంచివి, చెడ్డవి అని విభజించడం మానేస్తే బాగుంటుంది. అంతకంటే ,వాటిని అనుభవించండి,ఆనందించండి మరియు వాటినుండి నేర్చుకోండి.. ప్రతి సంఘటన మీకు పాఠాలు నేర్పుతుంది. ఈ పాఠాలే మీ అంతర, బాహ్య ఎదుగుదలను త్వరితం చేస్తాయి. తమను సవాలు చేసిన అనుభవాల నుంచే ఎక్కువ మంది వ్యక్తులుగా ఎదిగివుంటారు. మీరు ఊహించని ఫలితాన్ని చూసి మీకు నిరాశ కలిగితే , ఈ విషయాన్ని గుర్తుంచుకోండి………….
“ప్రకృతి న్యాయం ప్రకారం ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది”

శనివారం

మనీ మేక్స్ మెనీ థింగ్స్.

డబ్బు!!.
ఆధునిక ప్రపంచంలో డబ్బు అనేది జీవితం కంటే ముఖ్యమైనదిగా మారిపోయింది.మన సమస్యలలో అనేకం దీని చుట్టే తిరుగుతుంటాయి. మన జీవితం నుండి ప్రశాంతతని, ఆనందాన్ని దూరం చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నది. డబ్బు యొక్క అవసరాన్ని, ప్రయోజనాన్ని, జీవితంలో దాని యొక్క పరిమితిని అర్థం చేసుకుంటే దానినుండి బయట పడతాం.
జీవించడానికి డబ్బు కావాలి--కానీ డబ్బు కొరకే జీవించకూడదు.
డబ్బు జేబులో ఉన్నంతవరకు సమస్యలు రావు.
కానీ అది మనస్సులోకి ప్రవేశించి నప్పుడే కష్టాలు మొదలవుతాయి.
డబ్బును జేబు వరకే పరిమితం చేసిన వారి జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.
కోరికలు మూడు రకాలు. అవి అవసరాలు, సౌకర్యాలు,మరియు విలాసాలు.
అవసరాలకు,సౌకర్యాలకు డబ్బు ఖర్చు చేస్తే ఇబ్బంది లేదు.కానీ విలాసాలకు ఎక్కువ మొత్తం ఖర్చు చెయ్యడం అన్ని సమస్యలకు కారణం.
కాబట్టి డబ్బును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఆనందంగా జీవించండి..

మంగళవారం

think

ఒక్కోసారి మనకు మనమే అట్టే ఎదురుచెప్పకుండా ,మనస్తాపం చెందకుండానే మన అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటాం.కానీ అదే ఇంకెవరైనా మన అభిప్రాయాలు తప్పని చెపితే ,ఆ ఆరోపణ మనకి కోపం తెప్పించి ,మన మనసును కఠినంగా మారుస్తుంది. నమ్మకాలని ఏర్పరచుకోవటంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. కానీ ఎవరైనా ఆ నమ్మకాలని మనకి దూరం చెయ్యాలని ప్రయత్నించినప్పుడు మాత్రం వాటి మీద ఎక్కడలేని ఆపేక్షా పొంగి పొర్లుకొస్తుంది. ఆ అభిప్రాయాల మీద మనకి అట్టే మమకారం లేదని ,మన స్వాభిమానం దెబ్బతినటం వల్లే మనం అలా ప్రవర్తిస్తామని స్పష్టంగా అర్థమైపోతుంది.మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన పదం "నా"అనేది.కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అంచనా కట్టడంలోనే ,మనం తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది.మన అభిప్రాయాల్ని సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని ఎవరైనా అంటే మనం మొహం మాడ్చుకుంటాం.మనం దేన్నయితే ఇన్నాళ్లూ నిజమని నమ్ముతూ వచ్చామో,దాన్నే ఇకమీదట కూడా కొనసాగించాలని అనుకుంటాం.మన నమ్మకాల గురించి ఎవరైనా సందేహం వెలిబుచ్చినప్పుడు కలిగే కోపం వల్ల ,మనం ఆ నమ్మకాలనే పట్టుకు వేలాడటానికి అన్నిరకాల కుంటిసాకులు వెతుకుతాం. దీనివల్ల జరిగేదేమిటంటే ,మనం ఇంతకుముందునుంచి వేటినైతే నమ్ముతున్నామో వాటినే సమర్థించుకోవటానికి అవివేకంగా ఎన్నోరకాలుగా వాదిస్తూ ఉంటాం.ఇదే మనం ఆనందం కోల్పోవడానికి చాలా సార్లు కారణమౌతుంది.

ఆదివారం

తమ తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉన్నవాళ్ళకి ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది.దానివల్ల తాము ఒక అపరాధం చేశామన్న భావన ,మొండిగా సమర్థించుకోవటం అనే ఆత్మరక్షణా ప్రయత్నమూ తొలగిపోవటమే కాక ఆ తప్పు వల్ల తలెత్తిన సమస్యని పరిష్కరించుకోవటం కూడా సాధ్యమౌతుంది.
ఎటువంటి మూర్ఖుడైనా తన తప్పుల్ని సమర్థించుకోగలడు.నిజానికి మూర్ఖులే అలా చేస్తారు.కానీ తప్పులు ఒప్పుకోవటం అనేది ,ఒక వ్యక్తికి తాను మిగతా వారికంటే ఉన్నతుడు ,గొప్పవాడు అనే భావన కలిగించి,అతనికి బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది.

వినండి .

మీ మీద ఇతరులు ఆసక్తి కనబరచాలని మీరు కోరుకునేటట్లయితే ఎదుటివారి మీద మీరు ఆసక్తి కనబరచండి.ఎదుటివారు జవాబులు చెప్పటానికి ఇష్టపడే ప్రశ్నలే వారిని అడగండి.వాళ్ల గురించి ,వాళ్లు సాధించిన వాటి గురించి మాట్లాడేటట్లు ప్రోత్సహించండి.
మీతో మాట్లాడే వ్యక్తులకి తమ మీదా ,తమ ఇష్టాయిష్టాల మీద తమ సమస్యల మీదా ఉన్న ఆసక్తి మీ మీదా,మీ సమస్యల మీదా ఉండదని గుర్తుంచుకోండి.ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించే ముందు ఈ విషయం కాస్త ఆలోచించండి.
చక్కగా వినండి.ఎదుటివారిని తమగురించి చెప్పమని ప్రోత్సహించండి.ఇది మీరు మంచి వక్తగా రూపొందటానికి ఒక సులభమైన మార్గం.

గురువారం

వేల్యూ అఫ్ SMILE

దానికి ఏమీ ఖర్చు చెయ్యనక్కర లేదు.కానీ అధిక లాభం పొందవచ్చు.దాన్ని తీసుకొనేవారు,ఇచ్చేవారిని పేదరికానికి గురి చెయ్యకుండానే,ధనవంతులు అవగలరు.
అది ఒక్క క్షణమే ఉంటుంది.కాని దాని ప్రభావం మట్టుకు ఒక్కోసారి జీవితమంతా జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
అది మీ ఇంట్లో ఆనందాన్ని సృష్టిస్తుంది.వృత్తిలో సహృదయతని పెంచుతుంది.స్నేహానికి సరైన గుర్తింపు.
అది అలసిపోయినవారికి విశ్రాంతి.నిస్పృహ చెందిన వారికి వెలుగురేఖ.దుఃఖంలో ఉన్నవారికి సూర్యరశ్మి.ఎటువంటి సమస్యకైనా ప్రకృతి ప్రసాదించిన అతి ఉత్తమమైన విరుగుడు.
అయినా దాన్ని కొనటం ,యాచించటం,అప్పుతెచ్చుకోవడం మరియు దొంగిలించడం సాధ్యం కాదు.ఎందుకంటే ఎవరికైనా ఇవ్వటానికి తప్ప ,మన దగ్గర దాచి ఉంచుకోవటానికి అది ఏమాత్రం పనికిరాదు.
ఎందుకంటే ఎవరిదగ్గరైతే ఇంకొకరికివ్వడానికి చిరునవ్వులు మిగలవో ,వారికే వాటి అవసరం మిగతావారికన్నా ఎక్కువ!.

SMILE

మీ నవ్వు మీ సహ్రుదయతకి సంకేతం.మీ చిరునవ్వుని చూసే వారందరి జీవితాలూ వెలుగుతో నిండుతాయి. దాదాపు అన్నీ విసుగుమొహాలూ ,కోపిష్టిమొహాలు మరియు ఏడుపుమొహాలు చూసిన వారికి,మీ చిరునవ్వు-మబ్బుల్లోంచ్చి తొంగిచూసే సూర్యుడిలా కనిపిస్తుంది.ముఖ్యంగా,ఆ వ్యక్తి మానసిక ఒత్తిడులకుగురై ఉన్నా,ఆర్థికపరమైన ఇబ్బందులతో చికాగ్గా ఉన్నా,సమస్యలు తనని పీడించుకు తింటున్నా, ఒక చిరునవ్వు చాలు.జీవితం అంతా దుఃఖంతో కూడుకున్నదే కాదు అనే ధైర్యం అతనికి కలుగుతుంది.ఈ లోకంలో ఇంకా ఆనందం మిగిలి ఉందని అతను అనుకుంటాడు.