శుక్రవారం

జీవితాశయం!!.

ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి ,ఆ ఆదర్శం ఏదోఒకరకంగా ఇతరుల జీవితాన్ని మెరుగుపరచేలా ఉండి,దానికి అంకితభావంతోకృషి చేసినపుడు,ఆయాచితంగానే ఆనందం లభిస్తుంది.మీ జీవితలక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ఆ ఖచ్చితమైన లక్ష్యం పైనే మీ శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది.మీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు.కనక,ఎంతో విలువైన మీ మనశ్శక్తి ,అనవసరమైన ఆలోచనలపై వ్యర్థమవదు.మీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి,మరింత ఉత్పాదక స్వభావంతో పని చేస్తారు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ,మీ లక్ష్యసాధనకు మీ అంతరాంతరాల్లోంచి ఎవరో మార్గం చూపుతున్నట్లు మీలో ఒక విధమైన ప్రశాంతత,సంయమనం చోటుచేసుకుంటాయి.మీకు అలవాటైన పరిధి నుంచి బయట పడమనే దాన్ని అధిగమించినప్పుడే మనిషిగా మీలో ఉండే శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోగల్గుతారు.నెమ్మదిగా ఆలోచించండి, మన జన్మకు సార్థకత ఏమిటో దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి.అదో అద్భుతమైన అనుభూతి.