సోమవారం

మన దైనందిన జీవితంలో పూర్తిగా విస్మరించబడిన ఒక గొప్పగుణం అవతలివారిని మనస్పూర్తిగా ,నిజాయితీతో పొగడటం.పిల్లలు సాధించిన చిన్న చిన్న విజయాలని విస్మరిస్తాం.పిల్లలకి ,తల్లిదండ్రులు తమ పట్ల చూపించే ఆసక్తినిగాని,వారిమెచ్చుకోలుని గాని మించిన ఆనందం మరేది ఉండదు.
ఈసారి మీరు మంచి భోజనం తిన్నప్పుడు ,వంట చేసిన వ్యక్తికి భోజనం చాలా రుచికరంగా ఉందన్న విషయం తెలియజేయండి. అలాగే అలసిపోయినా కూడా సేల్స్ పర్సన్ మీతో వినయంగా మాట్లాడినప్పుడు ,దాన్ని గురించి అతని దగ్గరే మెచ్చుకోండి.
రోజువారి జీవితంలో చిన్న చిన్నక్రుతఙ్ఞతలని దారి పొడుగునా స్నేహభావంతో వదిలిపెడుతూ ఉండండి. మీరు మళ్ళీ ఆ వ్యక్తుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆశ్చర్యపడేలాచేస్తాయి.
అందుకే మనస్పూర్తిగా,నిజాయితీతో మెచ్చుకోండి.ఇతరులు మీ మాటలని పదిల పరచుకుంటారు .మనసులో భద్రపరచుకొని,ఎంతో విలువనిచ్చి తమ జీవితమంతా తల్చుకుంటూ ఉంటారు. మీరు మరచిపోయినా ఎన్నో ఏళ్ళ తరువాత కూడా వాటిని చెప్పుకుంటూ ఉంటారు.

ఆదివారం

Think with Smile-Do with Smile-Then you will get Smiles Everywhere

విమర్శవల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.ఎందుకంటే విమర్శ నెదుర్కొనేవ్యక్తి ఎప్పుడూఎదురు తిరుగుతాడు.తననితాను సమర్థించుకుంటాడు. విమర్శ ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తి తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది.అతని అహంకారాన్ని దెబ్బతీస్తుంది.కోపాన్నిరగిలిస్తుంది. విమర్శ రేకెత్తించే కోపం పనివారిని,కుటుంబసభ్యుల్నీ,స్నేహితుల్నీ కించపరుస్తుంది.అంతేకాక మీరు దేనికైతే వారిని నిందించారో ఆ పరిస్థితిని కూడా చక్కబరచదు.
మీరు విమర్శించడంమాని వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.వాళ్ళు చేసేపనులు ఆ విధంగా ఎందుకు చేస్తారో ఆలోచించండి-తెలుసుకొండి.విమర్శించడం కన్నా ఈ పని చేయటంలో లాభమూ,ఆసక్తీ ఉంటాయి.దీనివలన అవతలి వ్యక్తి మీద సానుభూతి కలుగుతుంది. ఓర్పు అలవడుతుంది. దయతో వ్యవహరించడం అలవడుతుంది.
దేవుడు కూడా చివరి రోజు వరకూ,మనిషి మంచి చెడ్డల్ని బేరీజు వెయ్యాలని అనుకోడు!.మరి మీరు ఎందుకా పని చెయ్యటం?.
4).మీరేదో సాధించటానికి పుట్టారు. అదేమిటో ముందు కనుక్కోండి. దాన్ని సాధించటానికి ప్రయత్నాలు ప్రారంభించండి. దానికి మీలోవుండే అంతర్గతశక్తుల సాయం తీసుకొండి. మీ చుట్టూ వున్న విషాదంలోంచి బయటకు మొదటి అడుగు మీరు వేయండి.
అపజయం వల్ల వెంటనే కలిగేది ఫస్ట్రేషన్.అది కోపం,నిస్సహాయత,అవమానంగా పరావర్తనం చెందకముందే దాన్ని “పట్టుదల”గామార్చుకోండి.
3).మీరు శారీరకంగా అందంగా లేకపోతే దాన్ని మీ వ్యక్తిత్వంతో భర్తీ చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడకపోతే అది వారి సమస్య,మీ సమస్య కాదు. ఇతరులు మీతో రోజుకి గంటో,రెండు గంటలో గడపవచ్చు.కానీ మీరు మీతో జీవితాంతం గడపాలి.కాబట్టి మీ కంపనీ మీకు ఆహ్లాదకరంగా వుండేలా చూసుకోండి.ఇంకొకరి విషాదానికి మీరు పోస్టుబాక్స్ కాకండి.

శుక్రవారం

గతాన్ని గురించి కలవరపడకుండా,భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా జీవించేందుకు ఒక మార్గం ఉంది."నీ కర్తవ్యాన్నినువ్వు నిర్వహించు- ఫలితాలు ఆశించకు". చాలా మందికి దీనికిగల నిగూఢమైన భావం తెలియదు. ఫలితం భవిష్యత్తుకు సంబంధిచినది. కర్తవ్యం వర్తమానానికి సంబంధిచినది. భవిష్యత్తును గురించి ఎవరైన కలవరపడితే, వర్తమానంలో నిలకడ తప్పుతుంది.అందుకే ఫలితాల గురించి కలత చెందకు అని అంటారు.

గతం నుండి నేర్చుకో- వర్తమానాన్ని అస్వాదించు- భవిష్యత్తును రూపొందించుకో.

గతం విషాదంతో నిండియుండవచ్చు. భవిష్యత్తు మనకు తెలియదు.వర్తమానం ఒక్కటే భగవంతుడు ప్రసాదించిన గొప్పవరం.
దీనినే ఇంకోలా చెప్పాలంటే .....
గతం చరిత్ర.
భవిష్యత్తు అంతుబట్టనిది.
వర్తమానం ఒక కానుక!
అందుకే మనం Present(కానుక) అని అంటాం.

కొందరు సరదాకి పని చేస్తారు- కాని తెలివైన వారికి పని చేయడమే ఓ సరదా!

గురువారం

సుస్వాగతం

భగవంతుడిచ్చిన వరం ఆనందం. దాన్ని చిన్న చిన్న కారణాలకు,సమస్యలకు,ఆవేశాలకు,ఆవేదనలకు మరియు మానసికఒత్తిడులకు కోల్పోకూడదు.చిన్న చిన్న అనే పదాన్ని ఎందుకు వడానంటే అవి ఎంత పెద్దవైనా జీవితంముందు,ఆనందం ముందు చాలా చిన్నవే. ముఖంపై చిరునవ్వు చిందించడం అంటే దైవాన్ని ప్రార్థించడమే.

మీ దుఃఖానికి ఎవరో ఎదుటివాళ్ళు కారణమనిచెప్పి ,వాళ్ళపై తప్పును మోపడానికి ప్రయత్నించకండి.మీ దుఃఖానికి మీరే కారణమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.మీ దుఃఖాల లోతులకెళ్ళి, దీనినుండి నేను నేర్చుకోగల పాఠం ఏమిటి అన్న విషయం ఆలోచించండి.ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయండి.అదే మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది.

ఆనందం అనేది తాళం కప్పలాంటిది.వివేకం తాళం చెవి వంటిది.తాళం చెవిని ఒకవైపుకి తిప్పితే ఆనందం తలుపులు మూసుకుపోతాయి.మరోవైపుకు తిప్పినట్టయితే ఆనందం తలుపులు తెరుచుకుంటాయి.