శనివారం

బాధ పడకండి!.భయపడకండి!!.వదిలి పెట్టకండి!!!.

“ జీవితంలో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది .
అనుకోని పనులు నెరవేరనప్పుడు
మీరు నడిచే దారి సాఫీగా లేనప్పుడు
మీ రాబడి కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నప్పుడు
మీరు నవ్వాలని ప్రయత్నిస్తే నిట్టూర్పులే వచ్చినప్పుడు
విచారం మిమ్మల్ని కొద్దిగా నొక్కి పెడుతూంటే-
కావాలంటే విశ్రాంతి తీసుకోండి,
కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం వదలకండి.

చిత్రమైన ఈ జీవితంలో చిక్కులూ,సమస్యలూ నిండి ఉంటాయి .
ఈ సత్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు మనందరం గ్రహిస్తాం.
కాస్త ఓర్మి వహిస్తే గెలుపు సాధ్యమయే తరుణంలో
మనిషి వెనుకంజ వేసి విఫలుడౌతూ ఉంటాడు.
మీ గమనం మందకోడిగా సాగినా ఆగకండి-
ఇంకాస్త ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది.

విజయం అనేది ఓటమి యొక్క మరో ముఖం-
సందేహం అనే మబ్బుల కుండే వెండి వెలుగుల అంచు అది.
విజయం ఎంత దూరంలో ఉందో చెప్పటం అసాధ్యం.
మీరు ఎంతో దూరంలో ఉందనుకున్నది చేతికందే దూరంలోనే ఉండవచ్చు.
కష్టాల్లో చిక్కుకున్నప్పుడే మీరు ధైర్యంగా నిలబడాలి.
పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నప్పుడే పట్టుదలతో ప్రయత్నించాలి.

మీరు అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి చేసే ప్రయాణం సుగమం కాదు.
అడుగడుక్కీ విఘాతాలు ఎదురౌతాయి.విజయాన్ని సాధించే వారికి , వీటిని అధిగమించి , నేలకి కొట్టిన బంతిలా పైకి లేచి , ఇంకా దృఢమైన నిశ్చయంతో , ముందుకి పోయే సామర్థ్యం ఉంటుంది.
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని , జీవితాన్ని సార్థకం చేసుకోవాలని తహతహలాడు తుంటారు .కాని అందుకు తగిన ప్రయత్నాలు చేయకుండా తమ కష్టాలు తొలగిపోవాలని , అదృష్టం కలిసి రావాలని ,పరిస్థితులు అనుకూలంగా మారాలని ఎదురుచూస్తుంటారు .అతి కొద్ది మంది మాత్రమే తమ జీవితంలో గణనీయమైన మార్పును కొనిరావడానికి ప్రయత్నిస్తారు .
ఆ ప్రయత్నమే వారిని విజయపథం వేపు మరలిస్తుంది .”

కామెంట్‌లు లేవు: