మంగళవారం

సద్గుణం!!.

మీరు ఎలా ఉన్నారో--ఎలాఉన్నప్పటికీ అంటే -కురూపిగా గానీ,అందంగా గానీ,చెడ్డగా గానీ లేదా మంచిగా
గానీ…….ఉన్నది ఉన్నట్లుగా, ఎటువంటి పోలికలు,భేదాలు మరియు వక్రతా కలుగ జేయకుండా అవగాహన చేసుకోవడంతోనే “సద్గుణం” ఆరంభమవుతుంది. సద్గుణం అత్యవసరం, అది స్వేచ్చనిస్తుంది. సద్గుణం అలవరచుకోవటం వల్ల రాదు.అలా చేస్తే గౌరవమర్యాదలు లభించవచ్చు గాని,అవగాహనశక్తిగాని, స్వేచ్చగానీ లభించదు. సద్గుణంతో ఉండటానికీ, సద్గుణంతో ఉండాలనుకోవటానికీ భేదం ఉంది. సద్గుణంతో ఉండటం ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటం వల్ల జరుగుతుంది. సద్గుణంతో ఉండాలనుకోవటం “వాయిదా” వెయ్యటమే ,ఉన్నదాన్ని- కావాలనుకునే దానితో కప్పిపుచ్చడమే అవుతుంది. కానిది అవటం సద్గుణంకాదు.ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటం, తద్వారా ఉన్నస్థితి నుంచి స్వేచ్చను పొందడం-ఇదే సద్గుణం .ఉన్నస్థితి మీరు ఉన్నదే కాని, మీరు కావాలని కోరుకునేది కాదు.

బుధవారం

విద్యావంతులు!!.

ప్రతి రోజూ తాము ఎదుర్కొనే పరిస్థితులని చక్కగా నిర్వహించగల వారినీ,ఆ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని,సరైన పద్ధతిలో వాటికి అనుగుణంగా నడుచుకునే వారినీ మొదట విద్యావంతులుగా చెప్పుకోవాలి.
ఆ తరువాత అందరితోటి గౌరవపూర్వకంగా వ్యవహరించే వారూ,తమ తోటి పనివారితో వీలైనంత వరకూ సర్దుకు పోయేవారూ ఈ కోవకి చెందుతారు.
ఇంకా ,సంతోషంగా ఉన్నప్పుడు,దాన్ని ఎక్కువగా బైట పెట్టకుండా అదుపులో పెట్టుకునేవారూ,తమ దురదృష్టాన్ని తలచుకొని కుంగిపోకుండా,దాని భరిస్తూ,ధైర్యంగా జీవిస్తూ తమ సహజ ప్రవృత్తికి నిండుతనం కలిగించేవారూ చదువుకున్నవారి కింద లెక్క.
అన్నిటికన్నా ముఖ్యంగా ,విజయగర్వంతో విర్రవీగకుండా ఉండగలవారూ,తమ సహజ స్వభావాన్ని వదలక ,వివేకంతోనూ,గంభీర స్వభావంతోనూ నిలదొక్కు కోగలవారూ ,ఏదో అదృష్టవశాత్తూ తమకి దొరికిన మంచి అవకాశాలని చూసి ఉప్పొంగి పోకుండా ,జన్మతః లభించిన స్వభావంవల్లనూ,తెలివితేటల వల్లనూ,స్వయంకృషి వల్లనూ సాధించిన వాటితో తృప్తి పడేవారు కూడా విద్యావంతులే.
ఒక్క మాటలో చెప్పాలంటే ,పరిస్థితులేమైనప్పటికీ ,వివేకంతోనూ,ధైర్యంతోనూ తమ మార్గాన్ని ఎంచుకునేవారు నిజమైన విద్యావంతులు.
మూర్ఖత్వాన్ని వదిలి వివేకాన్నీ,చెడుని వదిలి మంచినీ,అసభ్యతని వదిలి సభ్యతనీ,దుర్గుణాలని వదిలి సుగుణాలనే ఎంచుకున్నప్పుడు ,వారికి విశ్వవిద్యాలయాలు ఇచ్చే పట్టాలు ఉన్నా లేకపోయినా,వారు విద్యావంతులే.
అసతోమా సద్గమయా!.తమసోమా జ్యోతిర్గమయా!!.మృత్యోర్మా అమృతంగమయా!!!.